త‌్రిపురలోని బైద్యర్ డిఘీ, సెపహిజల జిల్లాలో బుధవారం తుఫాన్ బీభత్సం సృష్టించింది. తీవ్రమైన ఈదురు గాలులతో వర్షం కురవడంతో రెండు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ గురువారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తుఫానువల్ల నష్టపోయిన వారిని రాష్ట్రం ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఆవాసాలు కోల్పోయిన వారి కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సీఎం విప్లవ్ సందర్శించారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ నిరాశ్రయులకు ఆహార, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాగా, బుధవారం నాటి తుఫాను దాటికి త్రిపురలో బైద్యర్ డిఘీ, సెపహిజల జిల్లాల పరిధిలోని 500 ఇండ్లు గాలికి కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంట నష్టం వాటిల్లింది.