త్వరలో టీఎస్ బీపాస్‌
 భవన నిర్మాణ అనుమతులను పౌరులు లంచం ఇవ్వకుండా తీసుకునే బాధ్యత మునిసిపల్‌ శాఖ మంత్రిగా తనదని, ఇందుకు అతి త్వరలో ‘టీఎ్‌స బీపాస్‌’ (బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ సెల్ఫ్‌ సర్వీసెస్‌) విధానాన్ని తీసుకొస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఈ విధానం దేశానికే
ఆదర్శంగా మారుతుందన్నారు. వారం రోజుల్లో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎ్‌సకు మెట్రో కారిడార్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నాగోల్‌ నుంచి మెట్రోను అటు ఫలక్‌నుమా, ఇటు శంషాబాద్‌ వరకూ విస్తరిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీ షో -2020ను శుక్రవారం కేటీఆర్‌ ప్రారంభించారు. స్టాళ్లను సందర్శించి వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తి ధరలను బిల్డర్లు, డెవలపర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. హైదరాబాద్‌పైనే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలపైనా దృష్టిసారించామని, ఇటీవల వరంగల్‌కు కూడా ఐటీ కంపెనీలు వచ్చాయని గుర్తు చేశారు.


రూరల్‌ టెక్నాలజీ పాలసీతో జనగాం, హుజురాబాద్‌, కామారెడ్డి తదితర పట్టణాలకు ఊహించని విధంగా బీపీవోలు వస్తున్నాయన్నారు. బిల్డర్లు, డెవలపర్లు హైదరాబాద్‌ పైనే కాక కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌ తదితర ప్రాంతాలపైనా దృష్టిపెట్టాలని కోరారు. మునిసిపల్‌ శాఖ ద్వారా పెద్దఎత్తున నిధులు కేటాయించి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, టీయూఎ్‌ఫఐడీ ద్వారా రూ.2500 కోట్లతో వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 4 వేల స్టార్టప్స్‌ ఒకేచోట ఉండేలా జూన్‌, జూలైల్లో టీ హబ్‌ ఫేజ్‌-2 ప్రారంభించనున్నామని వివరించారు.