ప్రముఖ కార్ల తయారీదారు ఎంజీ మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ కారును భారత్‌లో ఇవాళ లాంచ్ చేసింది. ఎంజీ మోటార్స్ జెడ్‌ఎస్ ఈవీ పేరిట ఆ కారు విడుదలైంది. ఎంజీ మోటార్స్ నుంచి భారత మార్కెట్‌లో విడుదలైన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు ఇదే కావడం విశేషం. కాగా ఈ కారును రెండు వేరియెంట్లలో లాంచ్ చేశారు. ఎగ్జయిట్ వేరియెంట్ ధర రూ.20.88 లక్షలు ఉండగా, ఎక్స్‌క్లూజివ్ వేరియెంట్ ధర రూ.23.58 లక్షలుగా ఉంది. ఇప్పటికే ఈ కార్లకు బుకింగ్స్‌ను నిలిపివేయగా, ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి రూ.1 లక్ష తగ్గింపు ధరతో ఈ కార్లను విక్రయించనున్నారు. ఇక ప్రస్తుతానికి కేవలం ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్ నగరవాసులకు మాత్రమే ఈ కారు అందుబాటులో ఉంది.
ఎంజీ మోటార్స్ జెడ్‌ఎస్ ఈవీ కారులో 44.5 కిలోవాట్ల కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ బ్యాటరీని ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 340 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లవచ్చు. అలాగే కేవలం 40 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ 80 శాతం వరకు చార్జింగ్ అవుతుంది. 8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల పవర్‌ఫుల్ ఇంజిన్‌ను ఈ కారులో ఏర్పాటు చేశారు. ఇక ఈ కారు బ్యాటరీని ఎక్కడైనా చార్జింగ్ చేసుకునేందుకు వీలుగా 7.4 కిలోవాట్ల కెపాసిటీ కలిగిన చార్జర్‌ను ఎంజీ మోటార్స్ వినియోగదారులకు అందిస్తున్నది.